కేప్ టౌన్: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో పాకిస్తాన్ జట్టు చెలరేగి ఆడుతోంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ లాంటి టప్ జట్లపై వరుసగా రెండు విజయాలను నమోదు చేసి సెమీస్‌కు చాలా వరకు చేరువయ్యింది. దీంతో క్రీడా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటోంది పాకిస్తాన్ జట్టు. కాగా, వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
పాకిస్తాన్ క్రికెట్ యొక్క హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్ తో పాటు బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ లు ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మెగా ఈవెంట్ కు ముందు వారిద్దరూ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాస్తా సందిగ్దంలో పడిపోయింది.
అయితే పాకిస్తాన్ బోర్డు సక్లెయిన్ ముస్తాక్‌ను తాత్కాలిక హెడ్ కోచ్‌గా నియమించింది. కానీ ఈ పదవిని విదేశీ కోచ్‌కు అప్పగించాలని పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా భావిస్తున్నట్లు సమాచారం. ఈ తరుణంలోనే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, టీమిండియాకు హెడ్ కోచ్‌గా సేవలు అందించిన గ్యారీ కిర్‌స్టన్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు క్రీడా సమాచారం.
ఈ నేపథ్యంలో మిస్బా స్థానాన్ని గ్యారీ కిర్‌స్టన్‌తో భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గ్యారీ తో పాటు సైమన్ కటిచ్ (ఆస్ట్రేలియా), పీటర్ మూర్స్(ఇంగ్లండ్) పేర్లు కూడా తెరమీదకు వచ్చినట్లు తెలుస్టోంది. గ్యారీ కిర్‌స్టన్ 2008-2011 మధ్య కాలంలో టీమిండియా ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించాడు.
అతడు కోచ్ గా ఉన్న సమయంలో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత జట్టు 2011 వన్డే వరల్డ్‌కప్ ను గెలుచుకుంది. మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత భారత్ జగజ్జేతగా నిలిచింది. ఇక కిర్‌స్టన్ కోచ్‌గా ఉన్నపుడే టీమిండియా టెస్టు ఫార్మాట్‌లోనూ నంబర్ 1 ర్యాంకును సాధించింది.