దుబాయ్: పాకిస్తాన్ వరుసగా రెండు మేటి జట్లపై విజయాలతో టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ దారి పట్టిన తొలి జట్టయింది. షార్జాలో న్యూజిలాండ్ తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ బృందం ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి 4 పాయింట్లు సాధించింది.
కాగా పాకిస్తాన్ కు ఈ గ్రూప్–2లో తరువాత ఎదురయ్యే జట్లు మూడు అంతర్జాతీయ క్రికెట్ లో పసి కూనలు (అఫ్గానిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్) కావడంతో పాక్ కు సెమీఫైనల్ బెర్త్ దాదాపు ఖరారైనట్లే. టాస్ నెగ్గిన పాకిస్తాన్ మళ్లీ బౌలింగ్ ఎంచుకుంది. షరామాములుగా బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హారిస్ రవూఫ్ (4/22) కివీస్ ఇన్నింగ్స్‌ను ఏ దశలోనూ పెరగకుండ అడ్డుకున్నాడు.
పాకిస్తాన్ బౌలింగ్ దాడి వల్ల న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 134 పరుగులు చేసింది. డరైల్ మిషెల్ (20 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కాన్వే (24 బంతుల్లో 27; 3 ఫోర్లు) ఆడిన వారిలో మెరుగనిపించారు. కెప్టెన్ విలియమ్సన్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్) 20 పరుగుల మార్క్‌ను చేరుకోగా మిగతా వారంతా పాక్ బౌలింగ్‌కు తలవంచారు.
పాకిస్తాన్ టాపార్డర్‌లో కెప్టెన్ బాబర్ ఆజమ్ (9), ఫఖర్ జమాన్ (11), హఫీజ్ (11) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. అయితే ఇన్నింగ్స్‌ను చక్కబెడుతున్న రిజ్వాన్ (34 బంతుల్లో 33; 5 ఫోర్లు) కూడా ని్రష్కమించడంతో పాక్ ఒకదశలో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అనుభవజ్ఞుడైన షోయబ్ మాలిక్ (20 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), ఆసిఫ్ అలీ (12 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) జట్టును గెలిపించారు.