అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ప్రారంభమయ్యింది. మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలిదశలో ఎన్నికలు జరగబోతున్నాయి. నామినేషలను రోజూ ఉ.10.30 గంటల నుంచి సా.5 గంటల మధ్య మాత్రమే స్వీకరిస్తారు.
సర్పంచ్ పదవితో పాటు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో నిర్ధారించిన వార్డు సభ్యుల పదవులకు కూడా నామినేషన్లు తీసుకుంటారు. తొలిదశలో 18 రెవెన్యూ డివిజన్లలోని 168 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 3249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 4 వరకు గడువు కాగా, ఫిబ్రవరి 9న తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఈ ఎన్నికలకు ఈ సారి ఉ.6:30 నుంచి మ.3:30 వరకు పోలింగ్ జరగనుంది, అదేరోజు మధ్యాహ్నం కౌంటింగ్ నిర్వహిస్తారు. కాగా, విజయనగరం, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో డివిజన్ల వారీగా నాలుగు విడతల్లో జరిగే ఎన్నికల తేదీలు మారాయి. దీని ప్రకారం, పశ్చిమ గోదావరి జిల్లా తొలివిడతలో నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో, రెండో విడతలో కొవ్వూరు, మూడో విడతలో జంగారెడ్డిగూడెం, నాలుగో విడతలో ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరుగుతాయి.
విజయనగరం జిల్లా రెండో విడతలో పార్వతీపురం, 3, 4 విడతల్లో విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతాయి. ఇక ప్రకాశం జిల్లా తొలి విడతలో ఒంగోలు, రెండో విడతలో కందుకూరు, ఒంగోలు.. మూడో విడతలో కందుకూరు, నాలుగో విడతలో మార్కాపురం డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతాయి.