కామారెడ్డి: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగా, ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహిస్తున్న ఈ పరీక్షల మధ్యలో పేపర్ లీక్ వ్యవహారాలు అధికారులు, తల్లిదండ్రుల్లో భయాందోళనలు పెంచుతున్నాయి.
తాజాగా కామారెడ్డి జిల్లా జుక్కల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేపర్ లీక్ ఘటన చోటుచేసుకుంది. పరీక్ష ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు ప్రశ్నాపత్రంలోని కొన్ని ప్రశ్నలను ఒక కాగితంపై రాసి బయటకు పంపినట్లు సమాచారం. ఈ ప్రశ్నలు వెంటనే సోషల మీడియాలో వైరల్ అయ్యాయి.
విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించారు. పాఠశాల పరీక్షా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికలపై చర్యలు తీసుకుంటూ విధుల నుంచి సస్పెండ్ చేశారు.
ఈ ఘటన విద్యా వ్యవస్థపై ఎన్నో ప్రశ్నలు పెడుతోంది. పరీక్షల సమర్థవంతమైన నిర్వహణకు అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.