ఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ఆసక్తికర చర్చలకు దారి తీశింది. ఉభయ సభల సభ్యుల ముందు ఆమె దేశవ్యాప్తంగా కేంద్రం చేపట్టిన పలు కీలక పథకాలను వివరించారు.
ఈ సందర్భంగా ఏపీ జీవనాడిగా పరిగణించే పోలవరం ప్రాజెక్టును ప్రస్తావించడం విశేషం. రాష్ట్రపతి తన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టుకు ఇటీవలే రూ.12 వేల కోట్లు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, పూర్తయ్యే వరకు కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మెగా ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా ఏపీ ప్రస్తావన రావడం గమనార్హం.
రాష్ట్రపతి నోట ఏపీ ప్రస్తావన రావడంతో, రేపటి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి భారీ కేటాయింపులు ఉండే అవకాశముందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తికి మరింత బడ్జెట్ కేటాయించే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.