ఏపీ: హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో రోడ్డుపక్కన మృతదేహంగా కనిపించటం తీవ్ర చర్చకు దారి తీసింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిశోర్ తాజా ప్రకటన చేశారు.
ఈ కేసు పూర్తి పారదర్శకంగా విచారణ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఐదు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయని చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణులు ప్రమాద స్థలాన్ని పరిశీలించగా, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నామని వెల్లడించారు.
పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు. ఈ కేసు దశలవారీగా ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారని ఎస్పీ తెలిపారు. దర్యాప్తు వేగంగా సాగుతున్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలని సూచించారు.
కేసు దర్యాప్తులోకి సంబంధించి అసత్య ప్రచారాలు, పుకార్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆధారాలు ఉన్నవారు కొవ్వూరు డీఎస్పీని సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.