పల్నాడు: ఏపీ మాజీ సీఎం జగన్ సొంత కంపెనీ సరస్వతి పవర్ సంస్థపై ఇటీవల ఆస్తుల వివాదంలో ఆసక్తికరంగా మారింది. జగన్, షర్మిలల మధ్య ఆస్తుల పంపకాల వివాదంలో ఈ సంస్థ ప్రధాన అంశంగా మారగా, తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై కీలక చర్యలు చేపట్టారు.
సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూములపై సమగ్ర నివేదిక అందించాల్సిందిగా పల్నాడు జిల్లాలోని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
పల్నాడు జిల్లాలోని దాచేపల్లి, మాచవరం మండలాల్లో ఉన్న సరస్వతి పవర్ సంస్థకు సంబంధించి 1515 ఎకరాల భూమిపై ప్రభుత్వ భూములు, అటవీ సంపద, వాగులు, కొండ భూములు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ భూముల్లో ప్రభుత్వ భూములు, జలవనరులు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవాలని, అనుమతులు ఎలా మంజూరు చేశారో వివరించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఇక అటవీ, పర్యావరణ అనుమతుల పరిస్థితి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు ఎలా ఉన్నాయన్న విషయంపై పవన్ సమీక్ష నిర్వహించనున్నారని సమాచారం. జగన్, షర్మిల మధ్య వివాదం గడుస్తుండగా, ఈ భూముల అనుమతుల రద్దు వంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.