
ప్రముఖ నిర్మాత బన్నీ వాసు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఎన్నికల సమయంలో పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని ఆయనే పర్యవేక్షించారు. తాజాగా, జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహణలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు.
జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ తొలి భారీ సభ మార్చి 14న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరవుతారని అంచనా. ఏర్పాట్లు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి.
ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ, “ఇది కేవలం సభ కాదు, ఒక చరిత్ర. కార్యకర్తలకు నూతనోత్తేజాన్ని ఇచ్చే విధంగా ఈ సభ ఉంటుంది” అన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను శతశాతం పూర్తి చేస్తానని చెప్పారు.
అలాగే ఛత్రపతి శివాజీ కుమారుడి జీవిత కథ ఆధారంగా వచ్చిన ఛావా సినిమాను పవన్ కళ్యాణ్‌కు చూపించే యత్నం చేస్తానని అన్నారు. పవన్ హిందుత్వంపై స్పష్టమైన అభిప్రాయాలు కలిగి ఉన్నందున, ఈ సినిమా ఆయనకు నచ్చుతుందని అభిప్రాయపడ్డారు.
తెలుగులో ఈ నెల 7న గీతా డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఛావా సినిమాను విడుదల చేయబోతున్నామని తెలిపారు. మరి పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని చూస్తారో లేదో చూడాలి.