ఏపీ: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ వేడుకల్లో ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భయం లేని నాయకత్వమే జనసేనను విజయపథంలోకి నడిపిందని పేర్కొన్నారు. పిఠాపురం శివారు ప్రాంతం చిత్రాడలో జరిగిన “విజయకేతనం” సభలో ఆయన ప్రసంగించారు.
2014లో పార్టీని ప్రారంభించినప్పటి నుంచి తనపై ఎన్నో కుట్రలు జరిగాయని పవన్ పేర్కొన్నారు. 2019లో పరాజయం ఎదురైనా భయపడకుండా ముందుకు సాగానని, అదే ధైర్యంతో 2024 ఎన్నికల్లో గెలిచామని అన్నారు. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో జనసేన కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తుచేశారు.
ఒకప్పుడు అసెంబ్లీ గేట్లు కూడా తాకనీయబోమని చెప్పిన పార్టీలను ఓడించామని, జనసేన 100% విజయాన్ని సాధించిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగమై, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
తన రాజకీయ ప్రయాణం కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాదని, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ తనకు అభిమానులు ఉన్నారని పవన్ వెల్లడించారు. అక్కడి భాషల్లో ప్రసంగిస్తూ దేశంలో బహుభాషా విధానం అవసరమని చెప్పిన ఆయన, భవిష్యత్తులో తెలుగు ప్రజల గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత తనపై ఉందని తెలిపారు.
భారత మాతాకీ జై అంటూ తన ప్రసంగాన్ని ముగించిన పవన్, భవిష్యత్తులో తన పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. జనసేన కార్యకర్తలు, వీర మహిళల త్యాగాలు అప్రతిమమని కొనియాడారు.