ఏపీ: డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యాటక రంగ అభివృద్ధికి కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి దృష్టి సారించారు.
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో సమీక్ష నిర్వహించిన పవన్, ఫిల్మ్ టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
ఏపీకి చెందిన చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి సౌందర్యాలు సినిమాల్లో చూపిస్తే, ఆ ప్రాంతాలకు అంతర్జాతీయ గుర్తింపు రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
న్యూజిలాండ్, ఉక్రెయిన్ వంటి దేశాలు ఫిల్మ్ టూరిజం ద్వారా ఆర్థికంగా లాభపడిన తీరును ఉదాహరంగా చూపుతూ, ఏపీ కూడా అదే బాటలో నడవాలని పవన్ సూచించారు.
ఫిల్మ్ టూరిజం అభివృద్ధి చెందేందుకు ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణం కల్పించాలని, సౌకర్యాల మెరుగుదలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేస్తుండగా, వాటిలో ఫిల్మ్ టూరిజం ముఖ్యపాత్ర పోషిస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు.
ఒక సినిమా ద్వారా చూపిన ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారవచ్చని, ఆ స్పాట్‌ను ప్రమోట్ చేయడం ద్వారా రాష్ట్రానికి విపరీతమైన ఆదాయం వస్తుందని అన్నారు.
ఏపీ పర్యాటక రంగ అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు పెంచుతుందని, పర్యావరణం, చారిత్రక ప్రదేశాల సంరక్షణకు తోడ్పడుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. మంత్రి కందుల దుర్గేష్ సహా ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.