ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “పల్లె పండుగ” వారోత్సవాలు కంకిపాడు గ్రామంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
అనంతరం సభలో ప్రసంగించిన పవన్, చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన అనుభవం, నాయకత్వంపై ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేస్తూ, నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబే తనకు స్ఫూర్తి అని చెప్పారు.
పవన్ మాట్లాడుతూ, అనుభవవంతమైన నాయకుడి సేవలను ఉపయోగించుకోకపోతే రాష్ట్రం నష్టపోతుందని తెలిపారు. గతంలో టీడీపీతో కలిసి పని చేయాలనే నిర్ణయం తాము సరిగానే తీసుకున్నామని, చంద్రబాబు దిశానిర్ధేశం పాలనలో కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవహారాల్లో సమన్వయం ఎంతో అవసరమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో అరుదైన ఘట్టం సాధించామని పవన్ వెల్లడించారు. పంచాయతీ తీర్మానాలకు పరిపాలన మరియు సాంకేతిక ఆమోదం ఇప్పటికే ఇచ్చినట్లు తెలిపారు. అభివృద్ధి పనుల కోసం రూ.4,500 కోట్ల నిధులు విడుదల చేస్తున్నామని పేర్కొని, గ్రామీణ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.