విజయవాడ: పుస్తక మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఆయన కీలక సందేశం ఇచ్చారు.
‘‘నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పుస్తకాలను ప్రేమించాలి. నాకు తాను ప్రాణమైతే, నాకు పుస్తకాలు ప్రాణం,’’ అంటూ పుస్తకాల ప్రాముఖ్యతను వివరించారు.
తనకు కోట్లాది అభిమానుల హృదయాలను ఆకట్టుకునే శక్తి పుస్తకాల వల్లనే వచ్చినదని పవన్ చెప్పారు. తెలుగుభాషను పరిరక్షించడం అందరి బాధ్యత అని, యువత పుస్తకాలను చదివి సమాజంలోని అన్యాయాలపై పోరాడేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ, ‘‘ఇంగ్లీషు అవసరమే, కానీ అది పేదరికానికి పరిష్కారం కాదు,’’ అన్నారు.
పుస్తకాలు చదవడం మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుందని, జీవితంలో ఎదురయ్యే సమస్యలతో పోరాడేందుకు మనకు బలాన్నిస్తాయని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
‘‘రచయితలను గౌరవించాలి, పుస్తకాలను చదవడం జీవితాన్నే మార్చేస్తుంది,’’ అని యువతకు సూచించారు.