కర్నూలు జిల్లా: రాష్ట్రం ప్రస్తుతం అభివృద్ధి దిశగా సాగిపోతుందని, ఈ మార్పుకు ప్రధాన కారణం చంద్రబాబు నాయకత్వమనే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో ఫామ్‌పాండ్ నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కూటమికి ప్రజలు భారీ మెజారిటీతో అధికారాన్ని అప్పగించారని గుర్తు చేశారు. రాష్ట్రం బాగుండాలని సీఎం చంద్రబాబు కోరుకుంటున్నారని, ఆయన అనుభవం ఎంతో అవసరమని, కనీసం మరో 15 ఏళ్లు సీఎంగా ఉండాలన్నది తన ఆకాంక్ష అని పవన్ స్పష్టంచేశారు.
స్వయంగా తాను కూడా చంద్రబాబు స్ఫూర్తితో పనిచేస్తున్నానని తెలిపారు. పల్లె పండుగ విజయవంతం కావడానికి చంద్రబాబే కారణమని చెప్పారు.
రాయలసీమలో నీటి సమస్యలు అధికంగా ఉన్న నేపథ్యంలో, మే లోపు లక్షా 55 వేల నీటి కుంటల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. ఈ కుంటల ద్వారా వర్షపు నీరును నిల్వ చేసి, భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోవచ్చన్నారు. శ్రీకృష్ణదేవరాయల కలల వంటి రాయలసీమను ‘రతనాలసీమ’గా మారుస్తామని తెలిపారు.
వైసీపీ పాలనలో రహదారి నిర్మాణాలు చాలా తక్కువగా జరిగాయని విమర్శించిన పవన్, ఎన్డీయే ప్రభుత్వంలో ఎనిమిది నెలల్లోనే నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించామని వివరించారు. గిరిజన గ్రామాలకు రహదారి, విద్యుత్, తాగునీటి సదుపాయాలను కల్పించామని చెప్పారు.