ఏపీ: వైసీపీ ప్రభుత్వ పాలనపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్ల నిస్పృహపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
జగన్ హయాంలో అక్రమాలు కొనసాగుతున్నా, ఉన్నత విద్యావంతులైన అధికారులు ఎందుకు నిశ్శబ్దంగా ఉండిపోయారనే ప్రశ్న లేవనెత్తారు. టికెట్ రేట్ల నుండి ఇసుక దోపిడీ వరకు జరిగిన అక్రమాలకు వారు ఎలా సహకరించారని నిలదీశారు.
పవన్ మాట్లాడుతూ, “ఇలాంటి విధానాల వల్ల పాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమవుతోంది. ఇది శ్రీలంకలాంటి పరిస్థితులకు దారితీస్తుంది. ప్రజలు తిరగబడతారు,” అని హెచ్చరించారు.
జగన్ పాలనలో ఆర్థిక స్థితి క్షీణించి, అప్పులు 10 లక్షల కోట్లకు చేరినట్లు పేర్కొన్నారు. జీతాలకైనా డబ్బు లేకుండా రాష్ట్రాన్ని అధ్వానంగా మార్చారని విమర్శించారు.
అదే సమయంలో, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించిన పవన్, “రాళ్లు రప్పలతో ఉన్న ప్రాంతాన్ని హైటెక్ సిటీగా మార్చారు. అద్భుతమైన పునర్నిర్మాణం చేసి, సమర్ధ పాలన ఎలా ఉండాలో చూపించారు,” అని కొనియాడారు. టీడీపీ కింద రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో గుర్తు చేశారు.
కాకినాడ పోర్ట్ ద్వారా స్మగ్లింగ్ జరుగుతోందని, నిఘా లేకపోవడం వల్ల శత్రువులు చొరబాటుకు అవకాశం ఉందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారులు సమర్థంగా వ్యవహరించి, రాష్ట్రాన్ని పునరుద్ధరించాలని ఆయన కోరారు.