ఏపీ: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి మంగళవారం రోజు అత్యంత కఠినంగా మారింది. పెద్ద కుమారుడు అఖిరా నందన్ పుట్టినరోజు సందర్భంగా ఆనందించాల్సిన సమయంలో, చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ఘటన కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది.
బుధవారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి, సురేఖలతో కలిసి సింగపూర్‌కు వెళ్లిన పవన్, కుమారుడిని ఆసుపత్రిలో దర్శించారు. శంకర్‌ను చూసిన పవన్ భావోద్వేగానికి లోనయ్యారని సమాచారం. కాసేపు కుమారుడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన ఆయన, వైద్యులతో చర్చించారు.
ప్రస్తుతం శంకర్ చేతులు, కాళ్లకు గాయాలతోపాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిన నేపథ్యంలో వైద్యులు ఆయన్ని ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చారు. మరో 3 రోజులు ఆసుపత్రిలో చికిత్స కొనసాగనుంది.
పొగ వల్ల శంకర్ శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశంపై వైద్యులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే బ్రాంకో స్కోపీ చేసిన వైద్యులు నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చికిత్స మార్గం నిర్ధారించనున్నారు.
ఈ ఘటనపై అభిమానులు, రాజకీయ నేతలు స్పందిస్తూ శంకర్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో కోరుతున్నారు. పవన్ కుటుంబానికి సపోర్ట్ గా తెలిపే పోస్టులు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.