ఏపీ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తన ప్రాధాన్యతను చాటుకున్నారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రూ.49.73 కోట్లతో 9 గిరిజన ప్రాంతాల్లో 48 కి.మీ.ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
గిరిజనుల కష్టాలు తీరాలన్న ఉద్దేశంతో పవన్ స్వయంగా ప్రాజెక్టుల ప్రారంభానికి హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చు పెట్టి, గిరిజన ప్రాంతాలకు కనీస వసతులు కల్పించలేదని పవన్ విమర్శించారు.
డోలీలలో గర్భిణులను తరలించే గిరిజనుల కష్టాలను స్వయంగా అనుభవించారని, రోడ్లు నిర్మించడమే తమ ప్రాథమిక లక్ష్యమని చెప్పారు.
గిరిజనుల జీవితాలలో మార్పు తీసుకురావడమే తన కర్తవ్యమని పవన్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు 2027 నాటికి పూర్తి చేసి, రెండు నెలలకొకసారి గిరిజన ప్రాంతాల అభివృద్ధిని పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. ఈ చర్యలకు గిరిజన మహిళలు పవన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.