ఆంధ్రప్రదేశ్: అమెజాన్ గిఫ్ట్ కార్డుల వివాదంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా అమెజాన్ గిఫ్ట్ కార్డుల వ్యవహారంపై మరోసారి స్పందించారు. గిఫ్ట్ కార్డుల గడువు ముగిసిన తర్వాత అందులో మిగిలిన బ్యాలెన్స్‌ను తిరిగి పొందడానికి సరళమైన విధానం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెజాన్ గిఫ్ట్ కార్డుల్లో డబ్బును లోడ్ చేయడం ఎంత సులభమో, అదే విధంగా గడువు ముగిసిన బ్యాలెన్స్‌ను తిరిగి పొందడంలో సౌకర్యం ఉండాలని ఆయన సూచించారు.
వినియోగదారులు గడువు ముగిసిన తర్వాత కస్టమర్ సేవను సంప్రదించి తమ సమస్యను వివరించాల్సిన పరిస్థితి నెలకొనడం అనవసరమైన ఇబ్బందిగా అభివర్ణించారు. ఈ విధానం వినియోగదారుల న్యాయమైన హక్కులను కాపాడడంలో విఫలమవుతోందని విమర్శించారు.
జనసేన ఆఫీసు కూడా ఇదే సమస్యను ఎదుర్కొందని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న వినియోగదారు పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తపరిచారు.
ప్రీపెయిడ్ చెల్లింపు పరికరాలు కనీసం ఒక ఏడాది గడువు కలిగి ఉండాలని, గడువు ముగిసిన తర్వాత ముందస్తు నోటీసుతోనే ఖాతాను ఇనాక్టివ్ చేయాలని ఆర్బీఐ మార్గదర్శకాలను ఆయన మరోసారి గుర్తుచేశారు. అంతేకాకుండా, మిగిలిన బ్యాలెన్స్‌ను సోర్స్ ఖాతాకు లేదా లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసే సులభమైన విధానాన్ని అమలు చేయాలని పవన్ సూచించారు.
అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంలో 1 బిలియన్‌కు పైగా గిఫ్ట్ కార్డులు భారతీయ వినియోగదారుల చేత కొనుగోలు చేయబడినట్లు పవన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారుల హక్కులను పరిరక్షించడం ప్లాట్‌ఫారమ్‌ల ప్రాథమిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
పవన్ కేవలం అమెజాన్‌ను మాత్రమే కాకుండా, ఈ వ్యవహారంపై ఆర్బీఐ మరియు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా ట్యాగ్ చేస్తూ ఈ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. గడువు ముగిసిన బ్యాలెన్స్‌ను వినియోగదారులకు సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.