ఏపీ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూముల అక్రమాలపై దృష్టి సారించారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించారని వచ్చిన ఆరోపణలపై పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు.
ఈ మేరకు అటవీ శాఖ ఉన్నతాధికారులకు పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. పుంగనూరు నియోజకవర్గ పరిధిలో అటవీ భూముల ఆక్రమణను విచారించి, అసలు రికార్డులను పరిశీలించాలని పవన్ ఆదేశించారు.
భూముల రికార్డులు మారినట్టయితే, అందుకు బాధ్యులెవరనే అంశాన్ని నివేదికలో స్పష్టం చేయాలని కోరారు. అక్రమంగా ఆక్రమించిన భూములను తిరిగి ప్రభుత్వ అధీనంలోకి తీసుకురావాలంటూ అధికారులను ఆదేశించారు.
గతంలో బాధితులు పెద్దిరెడ్డి అక్రమాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా, చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నేరుగా వ్యవహారంలోకి దిగడంతో, పెద్దిరెడ్డికి ఎదురుదెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.