టాలీవుడ్: రాజకీయాల్లోకి వెళ్లి కం బ్యాక్ అయ్యాక వరుస సినిమాలని లైన్ లో పెట్టాడు పవన్ కళ్యాణ్. మొదట రాబోతున్నవి వకీల్ సాబ్ మరియు అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్ రీమేక్ సినిమాలు కావడం తో ఆ తర్వాత రాబోతున్న సినిమా పై అభిమానులు ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు. అది కూడా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రానుండడం తో ఖచ్చితంగా మంచి కంటెంట్ తో పాటు పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు ఉంటుంది అని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. ఈ రోజు మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన టైటిల్ మరియు టీజర్ విడుదల చేసారు సినిమా టీం.
ఈ సినిమాని ‘హరి హర వీరమల్లు’ అనే టైటిల్ తో రూపొందిస్తున్నట్టు సినిమా టైటిల్ విడుదల చేసి పవన్ కళ్యాణ్ లుక్ కి సంబందించిన చిన్న వీడియో విడుదల చేసారు. ఈ సినిమాని స్వాతంత్రానికి ముందు ఉన్న పరిస్థితులతో ఒక పీరియాడిక్ సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో పెద్దోళ్ళని కొల్లగొట్టి పేదోళ్ళకి పెట్టే ఒక బందిపోటు క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు అని ఒక టాక్ నడుస్తుంది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు టాక్ వుంది. ఈ రోజు విడుదల చేసిన టీజర్ లో సెట్స్, సినిమాటోగ్రఫీ, కీరవాణి అందించిన నేపధ్య సంగీతం ప్రత్యేకంగా అనిపించాయి. ఏ.ఎం రత్నం సమర్పణలో మెగా సూర్య మూవీస్ బ్యానర్ పై దయాకర్ రావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు కూడా తెలిపారు.