టాలీవుడ్ : పవన్ కళ్యాణ్ హీరోగా , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రస్తుతం ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి వెళ్లి కం బ్యాక్ అయ్యాక సినిమాల విషయంలో దూకుడు చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్. దాదాపు ఐదు సినిమాలు ప్రస్తుతం లైన్ లో పెట్టాడు. ఇప్పటికే వకీల్ సాబ్ షూట్ పూర్తి చేసి ఏప్రిల్ లో విడుదలకి సిద్ధం చేసాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాని రూపొందించిన డైరెక్టర్ సాగర్ తో ‘అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్’ మలయాళం రీమేక్ సినిమాని మొదలుపెట్టాడు. ఈ సినిమాకి అతి తక్కువ డేట్ లు కేటాయించి త్వరగా షూట్ పూర్తి చేసి మరో రెండు నెలల్లో ఈ సినిమాని కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
క్రిష్ తో చేయబోయే చారిత్రాత్మక సినిమా కూడా మొదటి షెడ్యూల్ పూర్తి అయింది. ఈ రోజు ఈ సినిమాకి సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చారు నిర్మాతలు. ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా 2022 జనవరి లో విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అదే సంక్రాంతికి మరో టాప్ హీరో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ కూడా విడుదలవబోతుంది. 90 ల్లో ‘శ్రీ సూర్య మూవీస్’ బ్యానర్ పై సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన నిర్మాత ఏ.ఎం.రత్నం ‘మెగా సూర్య ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఖుషి తర్వాత ఏ.ఎం. రత్నం ఈ సినిమాతో కం బ్యాక్ అవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక పీరియాడిక్ కథగా రూపొందుతున్న ఈ సినిమాని క్రిష్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.