హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైద్యం కోసం ఆక్సిజన్ కొరత లేదని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుత అవసరం 260 మెట్రిక్ టన్నులు ఉంటే, అందుబాటులో 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సిద్ధంగా ఉందన్నారు.
తెలంగాణలో పీఎం కేర్ నిధులతో 12 ఆక్సిజన్ తయారీ కేంద్రాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా రాకముందు 14 వందల బెడ్స్ కి మాత్రమే ఆక్సిజన్ సదుపాయం ఉండేదని, కానీ ఇప్పుడు 10 వేల బెడ్స్‌కు ఆక్సిజన్ సదుపాయం అందుబాటులో ఉందని అన్నారు. 700 ఐసీయూ బెడ్స్ కలిగిన గాంధీ ఆస్పత్రి దేశంలోనే పెద్దదని, మరో వారం రోజుల్లో 3010 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ప్రయివేటు ఆస్పత్రులు ఇతర రాష్ట్రాల పేషంట్లతో నిండిపోయాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా అవసర సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 350 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి రాబోతున్నట్లు పేర్కొన్నారు.
అలాగే మహారాష్ట్రలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో కూడా త్వరలో తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో అందించే బెడ్స్‌కి ధరలు నిర్ణయించామని కూడా తెలిపారు. అయితే ప్రైవేటు ఆస్పత్రుల ఉల్లంఘన కనిపిస్తుందన్న మంత్రి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసుకున్న తర్వాతే వైద్యం చేస్తున్నారని మండిపడ్డారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం మరో వైపు రాష్ట్రాలనే వ్యాక్సిన్ కొనుగోలు చేయాలని అనడం భావ్యం కాదని, కేంద్రానికి, రాష్ట్రాలకు వ్యాక్సిన్ ధరలు వేరువేరుగా ఉండటం ఏంటని ప్రశ్నించారు. 18 ఏళ్ళు పైబడిన వారు వ్యాక్సిన్ ను ప్రజలు సొంతంగా కొనుగోలు చేసుకోవాలని చెప్పడం ఘోరమైన చర్యగా అభివర్ణించారు.