హైదరాబాద్: రాష్ట్రంలో నేర నియంత్రణలో స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో సానుకూల ఫలితాలు వస్తాయని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో బాల్య వివాహాలు, గృహ హింస మరియు లైంగిక వేధింపుల నిరోధంపై స్వయం సహాయక బృందాల మహిళలకు చైతన్యం, అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థలు కలసి పనిచేయనున్నాయి.
నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ పరిపాలన శాఖ సంచాలకుడు సత్యనారాయణ, పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రాల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. జూమ్ ద్వారా డీజీపీ మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, దేశంలో తొలిసారిగా అడిషనల్ డీజీ నేతృత్వంలో మహిళా భద్రతా విభాగం ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్రానికే దక్కిందని గుర్తుచేశారు.
89 శాతం మంది సంతృప్తి:
తెలంగాణలో గత ఏడాది ప్రారంభించిన షీ టీమ్‌లకు 2020లో 5 వేల ఫిర్యాదులు అందాయని మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా తెలిపారు. ఈ షీ టీమ్‌ల పనితీరుపై ప్రముఖ సంస్థ సెస్ ద్వారా ఒక సర్వే నిర్వహించారని ఆ సర్వేలో 89 శాతం మంది షీ టీమ్‌ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని ప్రకటించారు.
రాష్ట్రంలో 1.70 లక్షల మహిళా బృందాల్లో 17 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, వీరికి గృహహింస, పని ప్రాంతాల్లో వేధింపులు, ఇతర సామాజిక సమస్యలపై చైతన్యం కల్పించడం హర్షణీయమని మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ చెప్పారు. పలు స్కూళ్లు, కళాశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా భద్రతా విభాగాల అధికారులు పాల్గొన్నారు.