టాలీవుడ్: టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలనుండి సినిమాలకి కంబ్యాక్ అయ్యాక వరుసగా సినిమాల్లో నటిస్తూ జోరు చూపిస్తున్నాడు. అంతే కాకుండా తాను ఇదివరకే స్థాపించిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై వరుసగా సినిమాలు చేయడానికి ప్లాన్ కూడా చేసాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి వారితో సంయుక్తంగా సినిమాల నిర్మాణం చేయడానికి చేతులు కలిపాడు. దీనికి సంబందించిన ప్రకటన ఒకటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేసింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై 15 సినిమాలు నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో ఆరు చిన్న సినిమాలు, ఆరు మీడియం రేంజ్ సినిమాలు మరియు మూడు పెద్ద బడ్జెట్ సినిమాలు రూపొందించనున్నట్టు తెలిపారు. కానీ వీటిలో పవన్ కళ్యాణ్ నటిస్తాడా లేదా అన్న విషయం ఐతే స్పష్టంగా తెలుపలేదు. కొత్త టాలెంట్ ని ఆవిష్కరించడానికి పూనుకుని మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై వరుసగా సినిమాలు చేయడానికి పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
పవన్ కళ్యాణ్ నటించిన కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ ఈ వారం విడుదలవనుంది. ఆ తర్వాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే పీరియాడిక్ యాక్షన్ మూవీ లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మలయాళం మూవీ ‘అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్’ రీమేక్ సినిమాలో దగ్గుబాటి రానాతో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమాని జులై లేదా ఆగష్టు లో విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.