న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం అయిన ఫేస్‌బుక్ తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు పెద్ద శుభవార్త తెలిపింది. తమ ఉద్యోగులు కావాలంటే శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని వాడుకోవచ్చని ప్రకటించింది. అంతే కాకుండా కరోనా సంక్షోభం వల్ల ఒక వేళ ఇతర దేశాలకు వెళ్లాలనుకుంటే దానికి తగిన సహాయం కూడా చేస్తామని తెలిపింది.
అమెరికా దేశంలో దాదాపుగా అందరికీ వ్యాక్సినేషన్ పూర్తవడం, ఇక త్వరలోనే అన్ని కార్పొరేట్ క్యాంపస్‌లలో తిరిగి కార్యకలాపాలు ప్రారంభం అవనున్న తరుణంలో ఫేస్‌బుక్ కంపెనీ ఈ తాజా ప్రకటన చేసింది. ఈ నెల 15 నుండి, రిమోట్‌గా ఉద్యోగం చేయలనుకునే ఏ ఉద్యోగి అయినా శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని వాడుకునేలా అనుమతిస్తున్నామని ఫేస్‌బుక్ తెలిపింది.
చేసే మంచి పని ఎక్కడి నుంచైన చేయవచ్చని తమకు గత సంవత్సర అనుభవం నేర్పిందని, అందువల్ల పనిచేసే విధానమే పనిచేసే ప్రదేశం కంటే ముఖ్యమైనదని నమ్ముతున్నట్లు పేర్కొంది. రిమోట్‌గా పనిచేసే ఉద్యోగుల కోసం వ్యక్తిగతంగా సమావేశాలను నిర్వహించాలని ఆలోచిస్తోంది. మే 2020 లో ఫేస్‌బుక్ కొంతమంది ఉద్యోగులను, ముఖ్యంగా అత్యంత సీనియర్ అనుభవజ్ఞులైన ఉద్యోగులను శాశ్వత రిమోట్‌గా పనిచేసుకోవచ్చని ప్రకటించింది.
గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కరోనా సంక్షోభం, లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఫేస్‌బుక్, గూగుల్, యాపిల్ లాంటి ఇతర దిగ్గజ కంపెనీలు రిమోట్ వర్క్ మోడల్ వైపు మొగ్గు చూపాయి అయితే సిలికాన్ వ్యాలీలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, అందరూ వ్యాక్సిన్‌లు తీసుకున్న నేపథ్యలో ఫేస్‌బుక్ ఆఫీసులను ఓపెన్ చేయాలని యోచిస్తోంది.