న్యూఢిల్లీ : అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ-20 ప్రపంచ కప్ వాయిదా పడటంతో ఐపీఎల్ నిర్వహణకు దారి సులువైంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఐపీఎల్ నిర్వహణకు ప్రణాళికలను వేగవంతం చేసింది. భారత్‌లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో మ్యాచ్‌లను ఇక్కడ జరిపే పరిస్థితి లేనందువల్ల ఈ సిజను ను యూఈఏలో నిర్వహించాలని ఇదివరకే నిర్ణయించింది.
దీంతో విదేశాల్లో లీగ్ నిర్వహణకు అనుమతిని కోరుతూ ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. ‘దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందును ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించాం’, దీనికి మీ అనుమతి కోరుతున్నాం అని లేఖ రాశారు.
టి20 ప్రపంచ కప్ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్‌ను నిర్వహించాలని తొలి నుంచీ భావిస్తున్న బీసీసీఐ, నిన్న ఐసీసీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో లీగ్ నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించి ప్రపంచ కప్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఒక్క ఏడాది ఐపీఎల్ నిర్వహించకపోతే బీసీసీఐకి దాదాపు 4వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన క్రికెట్ పెద్దలు ఎలాగైనా లీగ్ నిర్వహించాలని పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఐసీసీ ప్రకటన అనుకూలంగా రావడంతో మ్యాచ్‌ల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
కేంద్ర నుంచి అనుమతి రావడమే తరువాయి షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. కాగా దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా 2014లో తొలిసారి యూఏఈలో ఐపీఎల్-7ను నిర్వహించిన విషయం తెలిసిందే.