తెలంగాణ: సంచలనం రేపిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసు మరింత కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు నలుగురికి పోలీస్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఇప్పటికే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు అందగా, తాజాగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా ఈ కేసులో నోటీసులు పొందారు. ఫోరెన్సిక్ రిపోర్ట్‌లోని ఆధారాల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న ఈ కేసుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు మరికొందరికి నోటీసులు వస్తాయోనన్న అనిశ్చితి వారి మధ్య నెలకొంది.
ఈ కేసు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీపై కూడా ఆరోపణలు వేయడానికి కారణమైంది. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా దీనిపై కేంద్ర మంత్రులను కలుసుకునేందుకు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉండగా, ఆయనకు అమెరికా గ్రీన్ కార్డ్ వచ్చిందని సమాచారం. దీంతో, ఆయన త్వరలో ఇండియాకు తిరిగి రాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ కేసులో ప్రభాకర్ రావును భారత్‌కు రప్పించడం కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.