కోల్‌కతా: భారత్‌లో వచ్చే ఏడాది పర్యటించే ఇంగ్లండ్ జట్టుతో కోహ్లి బృందం ఒక డే అండ్ నైట్ టెస్టు ఆడునుందని, ఆ టెస్టు పింక్ బాల్‌తో నిర్వహించే ఈ మ్యాచ్ వేదికగా అహ్మదాబాద్‌ను ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు.
కోల్‌కతా ప్రెస్ క్లబ్‌లో మంగళవారం జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ ఈ విషయాన్ని వెల్లడించాడు. వచ్చే ఏడాది జనవరి–మార్చి మధ్యకాలంలో భారత్‌లో ఇంగ్లండ్ పర్యటించాల్సి ఉంది. సుదీర్ఘంగా సాగే ఈ పర్యటనలో ఇంగ్లండ్, ఐదు టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల క్రికెట్ కూడా ఆడాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ సిరీస్‌ను కూడా యూఏఈలోనే నిర్వహిస్తారనే వార్తలు వినిపించినప్పటికీ అవన్నీ ఊహాగానాలని గంగూలీ కొట్టి పారేశాడు.
‘భారత్‌లోనే ఈ సిరీస్‌ను నిర్వహించేలా బీసీసీఐ కృషి చేస్తోంది. ‘బయో సెక్యూర్ బబుల్స్’ను నిర్మించేందుకు కసరత్తులు చేస్తున్నాం. ఇందు కోసం అహ్మదాబాద్, కోల్‌కతా, ధర్మశాలలను పరిశీలిస్తున్నాం. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’ అని గంగూలీ వివరించాడు. ప్రస్తుతం తమ దృష్టంతా త్వరలో జరిగే ఆస్ట్రేలియా పర్యటనపై ఉందని, అందుకోసం జట్టును ప్రకటించాల్సి ఉందన్నాడు.