ఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాల్లో కోవిడ్ తాజా పరిస్థితి కోవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ప్రధాని సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. కరోనా థర్డ్ వేవ్ ఉండొచ్చన్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా ఏపీ సీఎం మాట్లాడుతూ, కోవిడ్ నివారణలో కేంద్ర నుండి రాష్ట్రానికి అందిస్తున్న తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలో లేకపోయినా కోవిడ్‌ను ఎదుర్కోవడంలో గురించదగ్గ పనితీరు కనబరిచామన్నారు.
ఏపీలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించకుండా సమర్థవంతంగా అడ్డుకోవడానికి బాగా పనిచేశాయని, రాష్ట్రంలో ఇప్పటివరకు 12 సార్లు ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే చేయించామన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని ముందుగా గుర్తించి వారిపి ప్రత్యేక దృష్టి పెట్టి కోవిడ్ పరీక్షలు నిర్వహించి కోవిడ్ విస్తరణను అడ్డుకోగలిగామని, వ్యాక్సినేషన్ కూడా సచివాలయాల ద్వారానే విజయవంతంగా వేస్తున్నామన్నారు.
ఈ సమావేశానికి ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ కె వి రాజేంద్రనాథ్ రెడ్డి, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.