బెంగళూరు: బెంగళూరు టెక్ సమ్మిట్ – 2020 కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర సింఘ్ మోడీ వీడియో కాంఫరెన్స్ ద్వారా గురువారం ప్రారంభించారు. ప్రారంభం తరువాత ప్రసంగిస్తూ భారత్‌లో రూపుదిద్దుకున్న సాంకేతిక ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా వినియోగమయ్యే సమయం ఆసన్నమైందని, సాంకేతికతే భవిష్యత్ దిక్సూచి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రపంచంలో ఇప్పుడున్న సమాచార, సాంకేతిక యుగంలో భారత దేశానికి ప్రత్యేకమైఅన మరియు సానుకూల స్థానం ఉంది అని అన్నారు. అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లగల స్థానంలో భారత్ ఉందన్నారు. అద్భుతమైన మేధస్సు ఉన్నవారు మన దగ్గర ఉన్నారు. అంతేకాదు, మన మార్కెట్ కూడా అతిపెద్దది. మన దగ్గర స్థానికంగా అభివృద్ధి చేసిన సాంకేతిక ఆవిష్కరణలు అంతర్జాతీయంగా విజయం సాధించగల సామర్ధ్యం ఉన్నవి’ అని పేర్కొన్నారు.
ఈ టెక్ సమ్మిట్ బెంగళూరులో మూడు రోజుల పాటు జరుగుతుంది. భారత్‌లో డిజిటల్ ఇండియా ఇప్పుడు దేశ ప్రజల జీవన శైలిగా, జీవితంలో విభజించలేని భాగంగా మారిందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. టెక్నాలజీ పరిశ్రమకు సహకరించే దిశగా తమ ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఉంటున్నాయన్నారు.
సైబర్ నేరగాళ్ళ దాడుల నుంచి, వైరస్‌ల నుంచి డిజిటల్ ఉత్పత్తులను కాపాడే సమర్దవంతమైన సైబర్ సెక్యూరిటీ విధానాలు రూపొందించే విషయంలో భారత యువత పెద్ద పాత్ర పోషించాల్సి ఉందన్నారు. దేశంలో ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా అవుతుందంటే దానికి సాంకేతికాభివృద్ధే కారణమని ఆయన అన్నారు.