హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 28న మధ్యాహ్నం హైదరాబాద్ పర్యటనకు వస్తున్నట్లు గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది. కోవిడ్–19 వైరస్‌కు విరుగుడుగా హైదరాబాద్ కు నగరానికి చెందిన భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ తయారుచేస్తున్న ‘కొవాగ్జిన్’ పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు ప్రధాని ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారు.
అయితే హైదరాబాద్ లో ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి నడుస్తోంది. ఇప్పుడు నరేంద మోడీ ఎంపిక చేసుకున్న సమయంపై రాజకీయాసక్తి నెలకొంది. 28న మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా మోదీ హకీంపేట సైనిక విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి శామీర్‌పేట వద్ద గల భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శిస్తారు. వ్యాక్సిన్ రూపకల్పనకు కృషిచేస్తున్న శాస్త్రవేత్తల బృందంతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం పుణె పర్యటనకు వెళ్తారని అధికారవర్గాలు తెలిపాయి.
అయితే ఇదే రోజున జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తారని ఈ నెల 19న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ప్రకటించారు. కాగా, 28నే ప్రధాని హైదరాబాద్ అధికారిక పర్యటన ఖరారైంది. దీంతో గ్రేటర్ ఎన్నికల రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
ఈ శనివారం 30 వేలమందితో నగరంలో భారీ బహిరంగసభ నిర్వహించి గ్రేటర్ ఎన్నికల వాతావరణాన్ని టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మలచుకోవాలనే వ్యూహాత్మక ఆలోచనతో సీఎం కేసీఆర్ ఉన్నారు. సరిగ్గా అదేరోజు ప్రధాని మోదీ అధికారిక పర్యటన ఖరారు కావడం వెనక బీజేపీ వ్యూహం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో దూకుడు వ్యవహారశైలితో ఓటర్లను తనవైపు తిప్పుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న బీజేపీ, చివరి అస్త్రంగా ప్రధాని మోదీని నగరానికి రప్పిస్తున్నట్టు సమాచారం.
సీఎం బహిరంగసభ రోజే ప్రధాని నగర పర్యటన జరిగితే జాతీయ మీడియాతో పాటు స్థానిక మీడియాలోనూ ప్రధాని పర్యటనకు అధిక ప్రచారం లభించే అవకాశాలున్నాయి. బల్దియా ఎన్నికల్లో బీజేపీకి ప్రధాని పర్యటన కొంత వరకు కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
కాగా, ప్రధాని మోదీ ఈ నెల 28న అధికారిక పర్యటన కోసం నగరానికి వస్తే ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ సైతం ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తరువాతే కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగసభకు వచ్చే అవకాశాలున్నాయి.