విశాఖలో ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న సందర్భంగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు విశాఖలో సమీక్ష నిర్వహించి, ప్రధానికి ఘనస్వాగతం పలుకుతామని తెలిపారు. ఈ పర్యటనలో ప్రధాని పలు కీలక ప్రాజెక్టుల శంకుస్థాపన చేయనున్నట్లు లోకేశ్ వివరించారు.
నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, రూ.70 వేల కోట్ల ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, విశాఖ-చెన్నై ఎకనామిక్ కారిడార్‌లో కృష్ణపట్నం ప్రాజెక్టులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ముఖ్యంగా, విశాఖ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని లోకేశ్ వెల్లడించారు. రైల్వే అభివృద్ధి పనులు, రహదారుల ప్రారంభోత్సవాలు ఈ పర్యటనలో భాగమని తెలిపారు.
కూటమి ప్రభుత్వం విశాఖలో అభివృద్ధికి కట్టుబడి ఉందని, గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు పక్కదారి పట్టించిందని లోకేశ్ విమర్శించారు.
విశాఖకు టీసీఎస్, గూగుల్ వంటి కంపెనీలను తెచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రధాని పర్యటన రాష్ట్రానికి అభివృద్ధి పునాది వేస్తుందని అన్నారు.