న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనాపై తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోడీ శనివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనాపై మరింత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎవరికీ వైరస్ సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించకూడదని వివిధ రాష్ట్రాల అధికారులకు ఆయన సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత, అలాగే ప్రతి ఒక్కరు వ్యక్తిగత దూరం పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని అయన సూచించారు. ఈ మహమ్మారిని సమర్థంగా కట్టడి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర, వివిధ స్థానిక అధికారులను ఆయన ప్రశంసించారు
ఢిల్లీలో కరోనాని కట్టడి చేయడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు తీసుకున్న చర్యలను మోడీ ప్రశంసించారు. కరోనా ఎక్కువగా వున్న రాష్ట్రాలు ఢిల్లీ అనుసరించిన విధానాలని అనుసరించాలని సూచించారు.
అలాగే అహ్మదాబాద్ లో విజయవంతమైన “ధన్వంతరి రథ్” విధానాన్ని అందరూ అమలు జరిగేలా చూడాలని అన్నారు. దీనిలో భాగంగా కరోనా భాదితులను ఇంటి వద్దనుండే పర్యవేక్షిస్తూ వైద్యం అందిస్తున్నాని, కరోనా భాదితులు ఎక్కువగా వున్నా ప్రాంతాల్లో ఈ విధానాలు అమలు చెయ్యాలని సూచించారు. పాజిటివ్ రేటు అత్యధికంగా వున్న ప్రాంతాలపై జాతీయ స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ప్రధాని మోడీ ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యారోగ్య శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్, నీతి ఆయోగ్ సభ్యులు, కేబినెట్ కార్యదర్శి సహా ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.