పోలవరం:ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా మారిన పోలవరం ప్రాజెక్టును 2027 జూన్‌లో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన ఆయన, అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని పరిశీలించారు. కేంద్రం నుంచి నిధుల అడ్డంకి లేదని, ప్రాజెక్టు పనులు ఇక వేగంగా కొనసాగుతాయని తెలిపారు.
వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేకపోవడమే పనుల ఆలస్యానికి ప్రధాన కారణమని చంద్రబాబు ఆరోపించారు. 2019లో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చుంటే 2020లోనే ప్రాజెక్టు పూర్తయ్యేది అన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 9 నెలల్లోనే ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టామన్నారు.
నిర్వాసితులపై ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో బాధ్యత ఉందని పేర్కొన్న చంద్రబాబు… ఇప్పటివరకు రూ.830 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో రూ.4,311 కోట్ల పరిహారాన్ని కూడా అందించినట్లు చెప్పారు. మిగిలిన మొత్తం త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రాజెక్టు పూర్తయ్యాకే ప్రారంభోత్సవం జరిపే ఉద్దేశం ఉందని తెలిపారు. ఇదే సందర్భంలో నిర్వాసితులు సంతృప్తిగా జీవిస్తున్నారని వారితో మాట్లాడిన తరువాత తెలియజేశారు. అన్ని వసతులతో పునరావాస కాలనీల నిర్మాణం జరుగుతోందని చెప్పారు.