తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు పోలీసు నోటీసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి సహా, పలువురు ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వారి నుంచి అక్రమంగా వందల కోట్లు డబ్బులు వసూలు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి.
రేవంత్ అధికారంలోకి రాగానే ఈ విషయంపై తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించారు. ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసులో అరెస్టయ్యారు, విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో లింగయ్యపై ఆరోపణలు ఉండటంతో, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఆయనను విచారణకు పిలిచారు. నిందితుడిగా ఉన్న పోలీస్ అధికారి తిరుపతన్నతో లింగయ్యకు ఫోన్ సంభాషణలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ కేసులో మరో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ నోటీసులు అందుకున్న వారిలో మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టి పెట్టిన రేవంత్ ప్రభుత్వం, ఈ కేసులో విచారణను ముమ్మరం చేస్తోంది. రేవంత్ సర్కారు పలు పోలీస్ అధికారులకు నోటీసులు జారీ చేయడమే కాకుండా అరెస్టులు కూడా చేసింది.
ఇదిలా ఉండగా, కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడంతోనే అమెరికా వెళ్లిపోయారు. ఆయన అమెరికా వెళ్లినప్పటి నుంచి ఇండియాకు రప్పించడానికి ప్రయత్నించినప్పటికీ, ఇటీవల గ్రీన్‌కార్డు పొందినందున ఇప్పట్లో ఆయన రాక కష్టమని తెలుస్తోంది.
ప్రభాకర్ రావు విచారణలో పాల్గొనాల్సిందేనని, ఆయన పూర్వాపరాలను వెల్లడిస్తే కేసులో నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకుంటున్న మరిన్ని బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.