హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు హైదరాబాద్ పోలీసులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. 150 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ లో 84, సైబరాబాద్ లో 38, రాచకొండ పరిధిలో 28 చోట్ల ఎన్నికలు జరగున్నాయి, హైదరాబాద్ సిటీలో 4,979 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
దాదాపు 50 వేల మందితో భారీ పోలీస్ భద్రతతో పాటు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్ద కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. రేపటి ఎన్నికల పోలింగ్‌కు భద్రతా పరమైన అన్నీ చర్యలు తీసుకున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు.
హైదరాబాద్ కమిషనరేట్‌లో 89 వార్డులు ఉన్నాయని, 4979 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు- 1517, అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 167 గుర్తించామని పేర్కొన్నారు. 406 మొబైల్ పార్టీలతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో 29 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 4187 గన్స్ డిపాజిట్ అయ్యాయి. 3066 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశామని పేర్కొన్నారు.
ఇప్పటికే జరిపిన తనిఖీల్లో 1.45 కోట్ల రూపాయల స్వాధీనం చేసుకున్నాం. పలు చోట్ల భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నాం. 63 ఫిర్యాదులో 55 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశాం. సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచాం. కౌంటింగ్ కేంద్రాల బయట నిరంతర సీసీటీవీ నిఘా ఉంచాం. రేపు ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
పోలింగ్ రోజున ప్రతి అభ్యర్థికి కేవలం ఒక్క వార్డు వద్ద ఒక్క వాహనం మాత్రమే అనుమతి ఇస్తాం. ఎలక్షన్ ఏజెంట్ కూడా అదే వాహనం లో వెళ్ళాలని’’ సీపీ అంజనీ కుమార్ తెలిపారు.