ఆంధ్రప్రదేశ్: పొలిటికల్ ప్రొడక్షన్స్ వారి “ఆంధ్రాలో హై డ్రామా”
పాత ఫొటోలతో దుష్ప్రచారం?
తిరుపతి (Tirupati) గోశాలపై మళ్లీ రాజకీయం వేడెక్కింది. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (Bhuma Karunakar Reddy) గోవుల మరణాలపై ఆరోపణలు చేస్తూ పాత ఫోటోలతో ప్రచారం ప్రారంభించడంతో పరిస్థితులు మారుమూలాల్లోకి వెళ్లాయి. వెంటనే టీటీడీ స్పందించి ఎలాంటి గోవులు చనిపోలేదని స్పష్టం చేసింది. అంతేగాక, భూమనపై పోలీస్ కేసు కూడా నమోదు అయింది.
టీడీపీ సవాల్ – భూమన సమ్మతి
ఈ ఆరోపణలపై స్పందించిన టీడీపీ (TDP), గురువారం ఉదయం 10 గంటలకు గోశాలకు వచ్చి లైవ్‌లో పరిశీలించమంటూ భూమనకు సవాల్ విసిరింది. దీనికి భూమన కూడా అంగీకరించారు. అయితే ఉదయం నుంచే తిరుపతిలో హైటెన్షన్ పరిస్థితి నెలకొంది.
గోశాల వద్ద ఉద్రిక్తతలు
గోశాల వద్దకు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ముందుగానే చేరుకున్నారు. భూమన రాక కోసం వేచి ఉన్నామని తెలిపారు. అదే సమయంలో భూమన ఎంపీ గురుమూర్తి (MP Gurumoorthy)తో కలిసి ర్యాలీగా బయల్దేరారు. కానీ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
పోలీసుల అడ్డంకులపై రోడ్డుపై నిరసన
పోలీసులు, గన్‌మెన్‌తో కాకుండా ఒంటరిగా వెళ్లాలని సూచించగా, భూమన నిరసనగా రోడ్డుపై పడుకున్నారు. దీనితో అక్కడ ఉద్రిక్తత పెరిగింది. భూమనకు మద్దతుగా మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja), డిప్యూటీ సీఎం నారాయణస్వామి (Narayanaswamy) కూడా చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.
గురుమూర్తి ఒక్కరే గోశాల చుట్టూ
అదే సమయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భద్రత కల్పిస్తాం గోశాలకు రావాలంటూ.. భూమనకు టీడీపీ ఎమ్మెల్యేలు పులివర్తి, బొజ్జల ఫోన్ చేశారు. ఎస్కార్ట్ కల్పిస్తే వస్తానని భూమన చెప్పారు. కట్ చేస్తే.. 10 నిమిషాల తర్వాత గోశాల దగ్గరికి తిరుపతి ఎంపీ గురుమూర్తి ఒక్కరే వచ్చారు. భూమనను పోలీసులు రానివ్వడం లేదని.. తానే గోడ దూకి వచ్చానన్న ఎంపీ గురుమూర్తి అన్నారు. కారులో వస్తే గోడ దూకి ఎలా వస్తావంటూ.. గురుమూర్తిని కూటమి ఎమ్మెల్యేలు నిలదీశారు. కూటమి పార్టీ ఎమ్మెల్యేలు, గురుమూర్తి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. కూటమి ఎమ్మెల్యేలు గట్టిగా ప్రశ్నించడంతో కాసేపటికే వైసీపీ ఎంపీ గురుమూర్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం తర్వాత కూడా రచ్చ కంటిన్యూ అయింది.
టీడీపీ ఘాటు వ్యాఖ్యలు
ఈ వ్యవహారంపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. ఎంపీ గురుమూర్తిలా భూమన కూడా రావచ్చునని, పోలీసుల అడ్డంకుల్ని సాకుగా చూపుతూ బాధ్యత నుండి పారిపోతున్నారంటూ విమర్శలు చేసింది. గోవుల మరణాలపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడింది.
భూమన పత్రికా సమావేశం
తిరిగి భూమన మీడియా ముందుకు వచ్చి తనను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ఐదుగురికి అనుమతిస్తే తాను వెంటనే రావడానికి సిద్ధమన్నట్లు పేర్కొన్నారు. టీడీపీ స్టేట్ చీఫ్ సవాల్ విసిరి తానే దాని నుంచి వెనక్కి తగ్గారని ఆరోపించారు.
హోంమంత్రి స్పష్టీకరణ
తిరుపతి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) స్పందించారు. గోశాల పరిణామాల నేపథ్యంలో ఎవరినీ హౌస్ అరెస్ట్ చేయలేదని, కేవలం శాంతిభద్రతల పరిరక్షణ కోసమే పోలీసులు చర్యలు తీసుకున్నారని వెల్లడించారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్రతి కార్యక్రమం సందర్భంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం సహజంగా మారిందని విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మాత్రం ప్రజాస్వామ్య విలువలకు తగిన విధంగానే వ్యవహరిస్తున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు.