న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ భారతదేశంలో జనవరి నెలలో ఆరంభమైంది. ఈ నేపథ్యంలో కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘లోకల్‌సర్కిల్స్’ ఒక సర్వే చేపట్టింది. ఈ కొత్త అధ్యయనం ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. కరోనా టీకా తీసుకోవడానికి ముందుకొచ్చేవారి సంఖ్య పెరిగిందనీ, అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,సినీ, క్రీడా సెలబ్రిటీలు ముందుగా టీకా తీసుకుంటే వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చింది.
ఈ సర్వే దేశంలోని 289 జిల్లాల్లోని దాదాపు 25 వేలకు పైగా పౌరులతో నిర్వహించిన లోకల్ సర్కిల్స్ అధ్యయనం ప్రకారం జనవరి 16 న భారతదేశం అతిపెద్ద టీకాల డ్రైవ్‌ను ప్రారంభించిన వారాల తరువాత, భారతదేశంలో వ్యాక్సిన్ వ్యాప్తి నెలలోనే 16 శాతం తగ్గింది.
58 శాతం మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటానికి ఇప్పటికీ వెనుకాడటం లేదు. అయితే ముందుగా ప్రజాప్రతినిధులు, ఇతర రాజకీయ నాయకులు టీకా తీసుకుంటే తామూ టీకా తీసుకునేందుకు వెనకాడబోమని చెప్పారు. 39 శాతం మంది ప్రజలు విముఖత చూపారు. అయితే ప్రముఖులంతా ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకుంటే వ్యాక్సిన్ పట్ల సుముఖత వ్యక్తం చేసే వారి సంఖ్య ప్రస్తుతమున్న 42 శాతం నుంచి 65 శాతానికి పెరుగుతుందని అంచనా.
కాగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, క్వీన్ ఎలిజబెత్-2, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, సౌదీ అరేబియా రాజు సల్మాన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో తదితరులు దేశ ప్రజలకు భరోసా కల్పించేలా బహిరంగంగా టీకాను ముందుగానే తీసుకున్న సంగతి తెలిసిందే.