విజయవాడ: పొన్నవోలు, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ పవన్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) పొన్నవోలు సుధాకర్, ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ సన్నిధికి చేరుకొని పూజలు చేసిన పవన్, మీడియాతో మాట్లాడుతూ పలువురిపై విమర్శలు గుప్పించారు. “పొన్నవోలు మదమెక్కి మాట్లాడుతున్నారు. నా మీద కోర్టులో కేసులేసుకోండి.. సనాతన ధర్మం గురించి మాట్లాడితే రోడ్లమీదకు లాగుతాం. ఇది తమాషాగా ఉందా, సరదాగా ఉందా? ప్రపంచ వ్యాప్తంగా హిందువులందరూ ఎంతో పవిత్రంగా ఆవునెయ్యను ఇత్తడితోనూ, పందికొవ్వును బంగారంతోనూ పోలుస్తారా? నేను అపవిత్రం జరిగిందని చెప్పాను. అది మాట్లాడకూడదా?” అని పవన్ ప్రశ్నించారు. అలాగే ప్రకాశ్ రాజ్ కూడా సెక్యులరిజంపై సరిగ్గా మాట్లాడాలని సూచించారు. “సెక్యులరిజం టూవే.. ఒన్ వే కాదు. ప్రకాశ్ రాజ్ అంటే గౌరవం ఉంది కానీ, ఆయన కూడా సరిగ్గా మాట్లాడాలి,” అని పవన్ అన్నారు.
సనాతన ధర్మంపై దాడులు కలచివేశాయి
పవన్ కళ్యాణ్, వైసీపీ నాయకుల తీరుపై కూడా విమర్శలు చేశారు. కనకదుర్గమ్మ రథం సింహాలు మాయమైతే, వైసీపీ నేతలు దానిని అపహాస్యం చేశారని, దీనిపై వైసీపీ పెద్దలు స్పందించకపోవడాన్ని పవన్ తీవ్రంగా తప్పుబట్టారు. “జగన్‌ను నేను ఎత్తిచూపడం లేదు, కానీ మీ కాలంలో జరిగే అపచారాలకు స్పందించాలి, దొంగల్ని వెనకేసుకురావడం మానుకోవాలి” అంటూ వైసీపీ నేతల తీరును నిలదీశారు. సాటి హిందువులు, తోటి హిందువులను దూషించడం అంగీకరించలేనిదని అన్నారు.
“సెక్యులరిజం అన్నింటికి వర్తించాలి”
పవన్ కళ్యాణ్, మసీదుల్లో చిన్న అపచారం జరిగితే ఇలాగే మాట్లాడతారా? హిందువుల పట్ల ఎలా మాట్లాడతారు? అంటూ ప్రశ్నించారు. “పొన్నవోలు సుధాకర్ చాలా పొగరుగా మాట్లాడారు. సనాతన ధర్మంపై దాడి జరిగినప్పుడు మాట్లాడకూడదా? మేం చాలా బాధపడ్డాం. మీరు సరస్వతీ దేవి, దుర్గాదేవిలపై జోకులు వేస్తారా? సనాతన ధర్మం రక్షణ హిందువులందరి బాధ్యత కాదా?” అని పవన్ వ్యాఖ్యానించారు.
భూమన కరుణాకర్, వైవీ సుబ్బారెడ్డిపై విమర్శలు
పవన్ కళ్యాణ్, భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మీద కూడా విమర్శలు గుప్పించారు. “భూమన కరుణాకర్ రెడ్డికి నాశనం మొదలైంది. వైవీ సుబ్బారెడ్డి విచారణకు రావాలి. ధర్మారెడ్డి కూడా గుడికి వచ్చే విధానంపై పవన్ సందేహాలు వ్యక్తం చేశారు. “మీ ప్రభుత్వాన్ని పడగొట్టిన మేము, ఇంకా ఏం చేయలేం అనుకుంటున్నారా?” అంటూ పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఫిల్మ్ ఇండస్ట్రీ పై..
సినిమా పరిశ్రమపై కూడా పవన్ కళ్యాణ్ తన నిరసనను వ్యక్తం చేశారు. “ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సైలెంట్‌గా ఉండాలి. మాట్లాడితే ఆలోచించి మాట్లాడాలి. నిన్న ఫంక్షన్‌లో లడ్డు గురించి మాట్లాడారు,” అంటూ సినీ ప్రముఖులకు కూడా పవన్ హెచ్చరికలు చేశారు.