ఏపీ: వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తాజాగా తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లపై చేసిన అసభ్యకర వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే పలు కేసులు నమోదవ్వగా, తాజాగా ఏపీ సీఐడీ అధికారులు పోసానిపై కేసు నమోదు చేశారు.
గత సెప్టెంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అసత్య ప్రచారానికి దిగారని తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు పోసానిపై 111, 196, 353, 299, 336 (3)(4), 341, 61(2) సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు వర్గాల మధ్య విభేదాలు రేకెత్తించేలా ఉన్నాయన్న ఆరోపణలతో ఈ కేసు నమోదు చేయడం గమనార్హం.
పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై చేసిన వ్యాఖ్యల కారణంగా కూడా పలు ప్రాంతాల్లో పోసానిపై ఫిర్యాదులు అందాయి. కడప, తిరుపతి, అనంతపురం, బాపట్ల, చిత్తూరు సహా పలు జిల్లాల్లో టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై కూడా పోసాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా పోసాని వివాదం రాజుకుంది. ప్రజలు, రాజకీయ నాయకులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, పోసానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.