ఆంధ్రప్రదేశ్: పోసాని కృష్ణ మురళికి 10 రోజుల రిమాండ్: గుంటూరు జైలుకు తరలింపు
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి నరసరావుపేట కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనపై తెదేపా నేత కిరణ్ ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో, పల్నాడు పోలీసులు పోసాని కృష్ణ మురళిని అదుపులోకి తీసుకుని సోమవారం సాయంత్రం నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం మార్చి 13 వరకు రిమాండ్ విధించడంతో, ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు.
రాష్ట్రవ్యాప్తంగా పోసాని కృష్ణ మురళిపై 17 కేసులు నమోదయ్యాయి. ఇటీవల అరెస్టయి ప్రస్తుతం రాజంపేట జైలులో ఉన్న ఆయనను అక్కడి ఉన్నతాధికారుల అనుమతితో పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు.
క్రైమ్ నెంబర్ 142/2024 కింద, నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోసానిపై IPC 153, 504, 67 కింద కేసు నమోదు చేశారు.
పోలీసులకు అప్పగించే ముందు, నరసరావుపేటలో పోసాని కృష్ణ మురళికి వైద్య పరీక్షలు నిర్వహించారు.