తిరువనంతపురం: మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ దశలో చాలావరకు రాష్ట్రాల్లో కేసులు తగ్గుతున్నప్పటికి కేరళ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. కేరళలో ఇంకా పాజిటివ్ కేసులు భారీగానె నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా కేరళలలో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో కొత్త విషయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి.
ఆ విషయం ఏంటంటే కోవిడ్ కట్టడికి దేశంలో ఇప్పటికే వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో కేరళలో రెండు డోసులు తీసుకున్నప్పటికి కూడా దాదాపు 40 వేల మంది కరోనా బారిన పడినట్లు తెలిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు ద్వారా ఈ విషయం వెల్లడైనట్లు సమాచారం.
ఈ కొత్త ఇన్ఫెక్షన్‌లపై కేంద్ర తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అలాంటి కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని కేరళ వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలిచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ల ద్వారా అందే రోగనిరోధక శక్తిని సైతం తట్టుకుని ఈ వైరస్ మ్యుటేట్ చెందితే అది తీవ్ర ఆందోళన కలిగించే విషయం అని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
కాగా ఈ కేసుల్లో చాలా వరకు కేరళలోని పతనంతిట్టా జిల్లాలోనే నమోదైనట్లు తెలుస్తోంది. ఈ జిల్లాలో మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా 14,974 మంది కరోనా బారిన పడగా, మరో 5,042 మందికి రెండో డోసు కూడా తీసుకున్న తర్వాత పాజిటివ్‌గా తేలింది. అంతేకాక కేరళలో చాలా అరుదుగా కనిపించే రీఇన్ఫెక్షన్లు కూడా ఉన్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కేరళలో కొన్ని వారాలుగా ప్రతి రోజూ 20 వేల వరకూ కేసులు నమోదవుతునే ఉన్నాయి.