మూవీడెస్క్: తమిళ సినీ ప్రపంచంలో విభిన్న పాత్రలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సిద్దార్థ్ (SIDDARTH), తెలుగులో ఒకప్పుడు లవర్ బాయ్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
కానీ ఆ తర్వాత అతని చిత్రాలు ఇక్కడ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు సిద్దార్థ్ తన తాజా చిత్రం మిస్ యు (MISS YOU) ద్వారా తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
తమిళంలో ఆషికా రంగనాథ్ జోడిగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం, నవంబర్ 29న తెలుగులో విడుదల కానుంది.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మిస్ యు విడుదలైన వారం తర్వాత పుష్ప 2 థియేటర్లలోకి వస్తోందని, దాని ప్రభావం మీ సినిమాపై ఉంటుందా? అని ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సిద్ధార్థ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.
“నేను నా కంట్రోల్‌లో ఉన్న విషయాల గురించి మాత్రమే మాట్లాడగలను. పుష్ప 2 లాంటి పెద్ద సినిమా వస్తుందని ఎందుకు భయపడాలి?
మంచి సినిమా ఎప్పుడూ నిలబడుతుంది. బడ్జెట్ ఎంతైనా, కథ బలంగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు.
పెద్ద సినిమాలేవి వస్తున్నాయనే విషయం నాకు సంబంధం లేదు.
మిస్ యు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటే థియేటర్లలో దాన్ని ఎవ్వరూ తీసివేయలేరు,” అని సిద్ధార్థ్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు.
ఇప్పుడు ప్రేక్షకులు అన్ని విషయాల్లో అవగాహనతో ఉంటారని, ఒకప్పుడు సోషల్ మీడియా లేకపోవడం వల్ల చిన్న సినిమాలు పెద్ద సినిమాల వల్ల థియేటర్ల నుంచి తొలగించబడ్డాయేమో కానీ, ఇప్పుడు పరిస్థితి మారిందని సిద్దార్థ్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.