మూవీడెస్క్: భారత మైకెల్ జాక్సన్‌గా పిలవబడే ప్రభుదేవా డ్యాన్స్ మాస్టర్ గా, నటుడిగా, దర్శకుడిగా అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ తన సత్తా చాటారు. తొలిసారిగా 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి దర్శకత్వం వహించి తొలి చిత్రంతోనే మంచి హిట్ అందుకున్నారు. దాని తరువాత తెరకెక్కించిన పౌర్ణమి సినిమా మాత్రం ఆశించిన విజయం సాధించలేదు.
ఆ తరువాత హిందీ, తమిళ భాషల్లో పోకిరి సినిమాను రీమేక్ చేసి అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇక అప్పటి నుండి డైరెక్టర్‌గా ఆశించినంత స్థాయిలో ఏ సినిమా హిట్ అవలేదు. ఈ మధ్యే సల్మాన్ ఖాన్‌తో తీసిన రాధే చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఘోరంగా విఫలమయ్యింది.
అందువల్ల ఇకనుండి దర్శకత్వానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పైగా ఇప్పుడు నటుడిగా వరుస అవకాశాలు అందుతుండండంతో ఇక వాటిపైనే దృష్టి సారించాలని భావిస్తున్నారని సమాచారం. తాజాగా ఆయన భగీరా అనే ఒక చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.