హైదరాబాద్: “మా” ఎన్నికలు తెచ్చిన సంక్షోభంలో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరుపున గెలిచిన 11 మంది సభ్యులు ఇవాళ రాజీనామాలు చేశారు. ఇవాళ ప్రకాశ్ రాజ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మూవి ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించిన శ్రీకాంత్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తమ సభ్యులు క్రితం జరిగిన విషయాలను దృష్టిలో ఉంచుకొనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఒకే అసోషియేషన్ లో రెండు ప్యానళ్లకు చెందిన సభ్యులు ఉంటే, అది ‘మా’ అభివృద్ది ఆటంకం ఏర్పడవచ్చని, అలాగే ఎవాఇనా సమస్యలు ఎత్తి చూపితే తమ వల్లే అవి జరగలేదని చెప్పే అవకాశాలు ఉంటాయని, అందుకే ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున గెలిచిన వారంతా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
ఇంతకుముందు ‘మా’ అధ్యక్షుడిగా చేసిన నరేశ్ ఆధ్వర్యంలోనే మంచు విష్ణు కూడా పనిచేస్తాడని శ్రీకాంత్ ఆరోపణ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని మంచు విష్ణు నెరవేర్చాలని, లేదంటే కచ్చితంగా ప్రశ్నిస్తామని తెలిపారు. ‘మా’ సంక్షేమం కోసమే తాము రాజీనామా చేశామని, తమకు ఓట్లేసిన వారిని ఈ ఒక్కసారి తమను క్షమించాలని శ్రీకాంత్ ఈ సందర్భంగా కోరారు.