న్యూఢిల్లీ: రాజకీయ దురంధరుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కన్నుమూశారు. అనారోగ్యంతో గత 21 రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ప్రణబ్, సోమవారం సాయంత్రం మృతి చెందారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో గుండెపోటుతో ప్రణబ్ మరణించారని వైద్యులు ప్రకటించారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో అదే హాస్పిటల్‌లో ఆగస్టు 10న ఆయనకు వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు.
అదే సమయంలో, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో పాటు కరోనా కూడా సోకడంతో అప్పటి నుంచి ప్రణబ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పైనే కోమాలో ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలను నేడు (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు లోధి రోడ్‌లోని శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబం వెల్లడించింది.
దాదాపు ఐదు దశాబ్దాల క్రియాశీల రాజకీయ జీవితంలో ఎన్నో అత్యున్నత పదవులను ప్రణబ్ అధిష్టించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేశ రాజకీయ చిత్రపటంపై చెరగని ముద్ర వేసిన నేతగా పేరుగాంచారు. జీవితాంతం రాజకీయ దురంధరుడిగా, అపర చాణక్యుడిగా, రాజనీతిజ్ఞుడిగా, నడిచే విజ్ఞాన సర్వస్వంగా దేశ ప్రజలు, సహచరుల మన్ననలు పొందారు.
ఎన్నో సంక్షోభాల నుంచి కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా గట్టెక్కించిన ట్రబుల్ షూటర్‌గా ఆయన గుర్తుండిపోతారు. 2019లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’తో ఆయనను గౌరవించింది. ప్రణబ్‌కు ఒక కుమార్తె షర్మిష్ట, ఇద్దరు కుమారులు అభిజిత్ ముఖర్జీ, ఇంద్రజిత్ ముఖర్జీ ఉన్నారు. భార్య సువ్రా ముఖర్జీ 2015లో చనిపోయారు. ప్రణబ్ మృతి వార్తను మొదట ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీటర్ ద్వారా ప్రకటించారు.