న్యూ ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన మెదడులోని గడ్డను తొలగించడానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శస్త్రచికిత్సకు ముందు కోవిడ్-19 పాజిటివ్ గా తేలిన ముఖర్జీ, 84, ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రెఫరల్ వద్ద వెంటిలేటర్ పై ఉన్నారు.
‘ప్రణబ్‌కు బ్రెయిన్ క్లాట్‌ను తొలగించేందుకు శస్త్రచికిత్స జరిగింది. ఆయన పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. వెంటిలేటర్‌పై ఉన్నారు’ అని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉందని, నిపుణులైన వైద్య బృందం ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపాయి.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కోవిడ్–19 బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోమవారం ఆయనే స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. గత వారంలో తనను సంప్రదించిన వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లడం లేదా కోవిడ్–19 పరీక్షలు చేయించుకోవడమో చేయాలని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన ఆయన విజ్ఞప్తి చేశారు. 2012–17 మధ్యకాలంలో ప్రణబ్ రాష్ట్రపతిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్‌ఆర్ ఆస్పత్రికి వెళ్లి ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన కూతురు షర్మిష్టకు ఫోన్ చేసి ప్రణబ్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అశోక్ గహ్లోత్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర మంతి పీయూష్ గోయల్ తదితర నేతలు మాజీ రాష్ట్రపతికి త్వరగా స్వస్థత చేకూరాలని ఆకాంక్షించారు.