fbpx
Sunday, January 19, 2025
HomeNationalప్రీ వెడ్డింగ్‌ షూట్‌ లో ప్రమాదం: జంట మృతి

ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ లో ప్రమాదం: జంట మృతి

PRE-WEDDING-SHOOT-KILLED-COUPLE

బెంగళూరు: పెళ్ళి చేసుకొని కొత్త జీవితం ఆరంభించాలని అనుకున్న ఒక జంట ఎన్నో కలలుగని చివరకు అర్ధాంతరంగా తనువు చాలించింది. వివాహ బంధంతో ఒక్కటి కానున్న వధూవరులు, ఆ వేడుకకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను బంధించే క్రమంలో మృత్యువాత పడటం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లో జరిగిన ప్రమాదం వారిని బలితీసుకున్న తీరు ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. ఈ హృదయ విదారక ఘటన కర్ణాటకలోని మైసూరులో చోటుచేసుకుంది. వివరాలు… క్యాతమరానహళ్లికి చెందిన చంద్రు(28), శశికళ(20) దూరపు బంధువులు. గతేడాది నవంబరు 22న ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది.

ఈ క్రమంలో ఈ ఏడాది అదే రోజున వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. పెళ్లి వేడుకల్లో భాగంగా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేయించుకోవాలని చంద్రు, శశికళ ముచ్చటపడ్డారు. ఫొటోగ్రాఫర్‌ను సంప్రదించిన ఈ జంట సోమవారం ఉదయం ముదుకుతూర్‌లో కావేరీ నదీ తీరాన జలధామ రిసార్ట్‌కు చేరుకున్నారు.

ఈ క్రమంలో మోటార్‌బోటు ఎక్కిన కాబోయే వధూవరులు, ఇంగ్లీష్‌ సినిమా ‘టైటానిక్‌’ లోని ప్రణయ దృశ్యాలను తలపించేలా ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే ఒక్కసారిగా అదుపుతప్పి నదిలో పడిపోయారు. చంద్రు, శశికళను కాపాడేందుకు ఫొటోగ్రాఫర్‌ చేసిన ప్రయత్నం విఫలమవ్వడంతో ఇద్దరూ జలసమాధి అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular