ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఇటీవల ‘ఎక్స్’ వేదికగా అభిమానులతో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో వివాదాస్పద పరిస్థితి ఎదుర్కొన్నారు. బీజేపీలో చేరుతున్నారా? అన్న ప్రశ్నకు కాస్త ఆగ్రహంగా స్పందించడంతో, తర్వాత ఆమె క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
ఒక అభిమాని వేసిన రాజకీయ ప్రశ్నకు ప్రీతి అసహనం వ్యక్తం చేస్తూ, తన వ్యక్తిగత జీవితం, భారతీయతపై గర్వాన్ని రాజకీయ రంగు పోసే ప్రయత్నాలను తప్పుబట్టారు. గుడికి వెళ్లడమో, కుంభమేళాలో పాల్గొనడమో రాజకీయానికి సంబంధం లేదని పేర్కొన్నారు.
అయితే, ఆమె సమాధానం దురుసుగా అనిపించిందని నెటిజన్లు పేర్కొనడంతో, వెంటనే ప్రీతి మరో ట్వీట్ చేశారు. తన స్పందన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని ఆమె కోరారు. వ్యక్తిగత జీవితాన్ని పొలిటికలైజ్ చేయడం తనను బాధించిందని వివరించారు.
తల్లిగా మారిన తరువాత తన పిల్లలకి భారతీయ మూలాలను మరిచిపోకుండా నేర్పించాలనే ప్రయత్నం చేస్తున్నానని ప్రీతి పేర్కొన్నారు. కానీ దీనికి కూడా విమర్శలు రావడం విచారించదగిన విషయమని అన్నారు.
ప్రస్తుతం ప్రీతి జింటా ‘లాహోర్ 1947’ సినిమాలో నటిస్తున్నారు. ఏడేళ్ల తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై కనిపించనున్నది అభిమానుల్లో మంచి ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.