కర్ణాటక: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా (మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కుంభకోణం విషయంలో తాను భయపడకుండా పోరాడతానని ప్రకటించారు. బెంగళూరు ప్రత్యేక కోర్టు ముడా స్కామ్‌పై విచారణ చేపట్టాలని ఆదేశించగా, మైసూరు పోలీసులను మూడు నెలల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపధ్యంలో, సిద్ధరామయ్య కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.
అయితే, గత మంగళవారం హైకోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఇచ్చిన అనుమతిని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గవర్నర్ చర్యలు చట్టబద్ధమైనవని కోర్టు పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ పార్టీ సిద్ధరామయ్యపై తీవ్రంగా విమర్శలు చేయడం ప్రారంభించింది.
సామాజిక కార్యకర్త టి.జె. అబ్రహం చేసిన ఆరోపణల ప్రకారం, ముడా అక్రమాల్లో సీఎం కుటుంబ సభ్యులు లబ్ధి పొందారని చెప్పారు. బీజేపీ పార్టీ సీఎం సిద్ధరామయ్యకు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించాలని బీజేపీ పేర్కొంది.
ఈ కేసులో న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం స్పష్టం చేశారు. బెంగళూరు ప్రత్యేక కోర్టు లొకాయుక్త ఆధ్వర్యంలో విచారణ జరగాలని ఆదేశించింది.