అమరావతి: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇంత వరకు ప్రైవేటు ఫాఠశాలల్లో మాత్రమే ఉన్న ఎల్ కేజీ, యూకేజీలు ఇక నుండి ప్రభుత్వ పాఠశలలో కూడా మొదలు పెట్టనున్నారు.
వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ క్లాసులను పీపీ-1, పీపీ-2గా ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యాశాఖను ఆదేశించారు. ప్రీ ప్రైమరీ విద్య కోసం ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించాలని సూచించారు. మంగళవారం పాఠశాల విద్య, గోరుముద్ద నాణ్యతపై సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు సహా నాణ్యమైన విద్యకోసం తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మానవవనరుల సమర్థ వినియోగం, ఉత్తమమైన బోధన తదితర అంశాలపై కూడా చర్చ సాగింది.
అనంతరం స్కూలు పిల్లలకోసం రూపొందించిన పాఠ్యపుస్తకాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. స్కూళ్ల పక్కనే అంగన్‌వాడీ కేంద్రాలు ఉంటే బాగుంటుందని అధికారులు ఈ సందర్భంగా ప్రతిపాదించగా అందుకు సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో 55వేల అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని, అందులో దాదాపు 35వేల కేంద్రాలకు భవనాలు లేవని సీఎం అన్నారు. ప్రైమరీ స్కూళ్ల కు సమీపంలోనే అంగన్‌వాడీలు ఉండాలంటే.. ముందుగా ఆయా స్కూళ్లలో తగిన స్థలాలు ఉన్నాయా? లేవా? అన్నదాన్ని పరిశీలించి నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.